సీఎం కేసీఆర్‌కు విశిష్ట ఆహ్వానం

-హెచ్‌టీ, మింట్‌ఆసియా నాయకత్వ సదస్సుకు రండి
-భారత్, ప్రపంచ సమస్యలపై చర్చలో పాల్గొనండి
-హిందుస్థాన్ టైమ్స్ ఈడీ శోభన భారతీయ లేఖ 
-సింగపూర్‌లో సెప్టెంబర్ ఆరో తేదీన సదస్సు
-గత సదస్సులకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరు

హైదరాబాద్ : హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టీ)- మింట్ ఆసియా నాయకత్వ సదస్సు రెండో ఎడిషన్‌లో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ను హిందుస్థాన్ టైమ్స్ మీడియా లిమిటెడ్ చైర్‌పర్సన్, ఎడిటోరియల్ డైరెక్టర్ శోభన భారతీయ ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆహ్వానలేఖ పంపారు. సింగపూర్‌లో సెప్టెంబర్ 6న హిందుస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులో విశిష్టవక్తగా పాల్గొనాలని లేఖలో ఆమె కోరారు. భారత్, ఇరుగు పొరుగుదేశాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు హెచ్‌టీ మిషన్‌లో భాగంగా 2003లో హెచ్‌టీ లీడర్‌షిప్ సమ్మిట్ ఇండియన్ చాప్టర్‌ను ప్రారంభించినట్టు లేఖలో పేర్కొన్నారు. 

ఇప్పటివరకు జరిగిన 16 సదస్సులు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయని, ఆయా సదస్సులకు అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, అమెరికా అధ్యక్షులు జార్జిబుష్, బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధానమంత్రులు డేవిడ్‌కామెరాన్, గార్డన్ బ్రౌన్, బౌద్ధ మతగురువు దలైలామా, భారత ప్రధాని నరేంద్రమోదీ వక్తలుగా హాజరైనట్టు తెలిపారు. ఈ ఏడాది నిర్వహించే సదస్సులో ఆసియాదేశాల్లోని నాయకులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి సింగపూర్ చాప్టర్‌పై చర్చించి ఒక రోడ్‌మ్యాప్ రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఆసియా ఇన్ ది న్యూ గ్లోబల్ కాంటెక్స్ అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *