గ్రామాభివృద్ధి బాధ్యత సర్పంచులదే

ఉద్యమాలతో సాధించిన తెలంగాణను గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సర్పంచులకు విశేష అధికారాలు కల్పించిందనీ, అభి వృద్ధి బాధ్యత సర్పంచులదేనని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా సంగారెడ్డిని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ప్రభుత్వోద్యోగులతో కలిసి మంత్రులను గజమాలతో సన్మానించారు. అనంతరం కంది మండలం చిమ్నాపూర్‌లో మొక్కలు నాటారు. ఐదో విడత హరితహారంలో 3.50లక్షల మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ హనుమంతరావు, జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓడీఎఫ్ జిల్లాగా జోగుళాంబ గద్వాల

జోగుళాంబ గద్వాల ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా కలెక్టర్ శశాంక ప్రకటించారు. శనివారం గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిచేడ్‌లో జరిగిన కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహంలతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలో లక్షన్నర కుటుంబాల్లో 50 వేల కుటుంబాలు ప్రస్తుతం మరుగుదొడ్లు నిర్మించుకున్నాయనీ, వివిధ దశల్లో 12 వేల మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 2018లో కేవలం 14 వేల మరుగు దొడ్లు నిర్మిస్తే 2019లో ఇప్పటివరకు 36 వేల నిర్మాణాలు పూర్తిచేసి జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించుకోవడం సంతోషకరంగా ఉందని కలెక్టర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *