చెరువు మురిసింది

చెరువు మురిసింది. స్థానికంగా కురిసిన వర్షాలతోపాటు, గోదావరి, కృష్ణా నీటితో అనేక చెరువులు నిండుకుండల్లా మారాయి. కడలి వైపు పరుగులు పెడుతున్న నదీజలాలు గొలుసుకట్టు చెరువుల ద్వారా పొలాల్లోకి తరులుతున్నాయి. ఒకప్పుడు చిన్నపాటి వర్షానికే కట్టలు తెగే చెరువులు మిషన్ కాకతీయతో రిజర్వాయర్లను తలపిస్తున్నాయి. గొలుసుకట్టు చెరువులతో రాష్ట్రంలో నదీజలాల వినియోగం భారీగా పెరుగనున్నది. చెరువుల పునరుద్ధరణకు సర్కారు చేపట్టిన మిషన్ కాకతీయ విజయం ఇప్పుడు గ్రామాల్లో చెరువులన్నింటా కనిపిస్తున్నది.

సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన చారిత్రక చెరువుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలిస్తున్నది. వర్షం నీటిని ఒడిసిపట్టడంతోపాటు, గోదావరి, కృష్ణా జలాల తరలింపుతో రాష్ట్రంలో చెరువులు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదులు ఉధృతిగా ప్రవహిస్తుండటం, రిజర్వాయర్లు, కాల్వల కింద ఉన్న చెరువులకు నదుల నీటిని మళ్లిస్తున్నారు. ఫలితంగా ఒకచెరువు నిండటంతో గొలుసుకట్టుగా దానికింద మరిన్ని చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. రాష్ట్రంలో కాల్వల వ్యవస్థ పూర్తయిన భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలో 16,700 చెరువులు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదులతో అనుసంధానం ఉన్న చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్‌లో మొత్తం 20,231 చెరువులు ఉండగా… ఈ నెల 1 వరకు 13,460 చెరువులు 25 శాతం, 2,494 చెరువులు 50 శాతం, 2,434 చెరువులు 75 శాతం, 1,231 చెరువులు 100 శాతం నిండాయి. 

ఇందులో 612 చెరువులు మత్తడి దుంకుతూ దిగువకు పారుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో మొత్తం 23,609 చెరువుల్లోకి జలాలు చేరాయి. 22,479 చెరువుల్లో 25 శాతం, 820 చెరువుల్లో 50 శాతం, 161 చెరువుల్లో 75 శాతం, 96 చెరువుల్లో 100 శాతం నీళ్లు చేరాయి. 53 చెరువుల నుంచి మత్తడి దుంకుతున్నాయి. తెలంగాణలో 46,531 చెరువులు ఉండగా.. మిషన్ కాకతీయపథకం కింద ప్రభుత్వం నాలుగు దశల్లో 25,985 చెరువులను పునరుద్ధరించింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.8,741.80 కోట్ల విలువైన పనులు చేపట్టింది. ఈ చెరువుల కింద ఉన్న మొత్తం 21.39 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండుపంటలకు సాగునీరు లభించడంతోపాటు భూగర్భజలాలూ గణనీయంగా పెరుగుతున్నాయి.

ponds3

కరువు జిల్లాల్లో సంబురం

ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో దాదాపు 8 వేల చెరువులు ఉండగా.. 6 వేలకుపైగా చెరువుల్లోకి కృష్ణా జలాలు చేరాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 8 లక్షల ఎకరాలు చెరువుల కింద ఆధారపడిసాగవుతున్నాయి. జూరాల నుంచి సమాంతర కాల్వ, ఎడమ, కుడి కాల్వ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పరిధిలోని చెరువులకు నీటిని మళ్లించారు. ఎగువన వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతుండగా.. వచ్చే వరదను సద్వినియోగం చేసుకునే నేపథ్యంలో చెరువులకు తరలిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2,702 చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

14.6 అడుగులకు పాకాల నీటిమట్టం

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ రూరల్ జిల్లాలోని పాకాల సరస్సు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. శనివారం సాయంత్రానికి 14.6 అడుగులకు చేరుకున్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆదివారం ఉదయానికి 15 అడుగులకు పైగా చేరే అవకాశం ఉన్నది. సరస్సు గరిష్ఠ నీటిమట్టం 30.3 అడుగులు. మరో 7 అడుగుల నీరు చేరితే వానకాలం సాగుకు ఢోకా లేనట్లే.

ponds2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *