అక్సిటోసిన్ ఇంజక్షన్లు సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : అక్సిటోసిన్ ఇంజక్షన్లను బీదర్ నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు డీసీపీ చైతన్యకుమార్ కథనం ప్రకారం.. కేంద్ర ఆరోగ్య శాఖ అక్సిటోసిన్ ఇంజక్షన్ల విక్రయాలపై ఆంక్షలు విధించింది. పశువులు ఎక్కువగా పాలు ఇచ్చేందుకు డెయిరీ ఫారం నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధ్దంగా ఈ ఇంజక్షన్‌ను ఉపయోగిస్తుంటారు. పాతబస్తీలోని పలు డెయిరీ ఫారాల యజమానులతో సంబంధాలున్న బాబానగర్‌కు చెందిన ఇంతియాజ్, బీదర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్‌తో కలిసి ఈ ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇస్మాయిల్ ఆటోలో బీదర్ నుంచి ఎలాంటి ప్రిస్కిప్షన్, బాటిల్స్‌పై లేబుల్స్ లేకుండా 1920 బాటిల్స్‌లో నగరానికి వస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఇంతియాజ్ ఆదేశాల మేరకు నగరానికి తెస్తున్నానని ఒప్పుకున్నాడు. ఇంతియాజ్ పరారీలో ఉండడంతో ఇస్మాయిల్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద అక్సిటోసిన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పశువులకు ఈ ఇంజక్షన్ వాడడం వల్ల వాటి జీవితకాలం తగ్గుతుంది, ఈ పాలను వాడడంతో మనిషులకు పలు రకాల రుగ్మతలు వస్తాయని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *