వెస్ట్‌జోన్‌లో ఉచితంగా న్యాప్‌కిన్ల పంపిణీ

హైదరాబాద్: పచ్చదనం పరిశుభ్రతసహా పలు విభిన్న అంశాలపై దృష్టిని కేంద్రీకరించిన నగరంలోని వెస్ట్‌జోన్ అధికారులు తాజాగా మహిళల వ్యక్తిగత శుభ్రత అంశం ప్రాధాన్యతగా కృషిని ప్రారంభించారు. మహిళలు, యువతులు, విద్యార్థినుల నెలసరి సమస్యలకు పరిష్కారం దిశగా తగిన ఆరోగ్యకర ప్యాడ్లను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఈమేరకు వెస్ట్ జోన్ పరిధిలో సానిటరీ నాప్‌కిన్స్ ఉచిత పంపిణీ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జోన్ పరిధిలోని పలు కూడళ్ల వద్ద ఈ యంత్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉచితంగా వాటిని మహిళలకు అందించబోతున్నారు. ప్రధానంగా నెల సరి సందర్భంగా మహిళలు, యువతులు అనారోగ్యకర వస్ర్తాలను అధికం గా వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆ సమయంలో ఆరోగ్యకర నాప్‌కిన్స్‌ను ఉచితంగా పంపిణీ చేయటం ద్వారా వ్యక్తిగత భద్రత, పరిశుభ్రతను పాటించేలా చేయాలన్నది తాజా ఆలోచన. ఈమేరకు రూ.2.5 లక్షలతో వెస్ట్ జోన్ పరిధిలోని పలు ప్రధాన కూడళ్లలో మహిళల నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందించే ప్రత్యేక యంత్రాల(కియోస్క్)ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 

ఇప్పటికే ఇందుకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ సైతం పూర్తి కాగా త్వరలో వాటి ఏర్పాటు కానున్నాయి. ఈ యంత్రాల ద్వారా మహిళలు తమకు కావలసిన నాప్‌కిన్స్‌ను ఉచితంగా పొందే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నెలసరి సమయంలో సింహభాగం విద్యార్థినులు పాఠశాలలకు దూరంగా ఉంటున్నట్లు పలు సర్వేలు సైతం తెలిపిన నేపథ్యంలో ఆరోగ్యకరమైన సులువైన ప్యాడ్లను ఉచితంగా అందించటం ద్వారా వారికి భరోసా కల్పించాలన్నది ఇక్కడి వెస్ట్‌జోన్ అధికారుల యోచన. వీటిని ఆ మూడు రోజులపాటు వినియోగించుకున్న అనంతరం తిరిగి అవే యంత్రాల ద్వారా బూడిద చేసే వెసులుబాటు సైతం ఉన్నది. ఇలా చేయటం ద్వారా ఎటువంటి అనారోగ్యకర పరిస్థితులు తలెత్తకుండా చూడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ తరహాగా మహిళలకు ఉపయోగపడే న్యాప్‌కిన్స్‌ను ప్రత్యేక యంత్రాల ద్వారా పంపిణీ చేసే ప్రయత్నం వెస్ట్ జోన్‌లో తొలిసారిగా జరుగుతుండగా బల్దియాలోనే ఇదే ప్రథమం కావటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *