కివీస్ కాస్కో..

-తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ ఢీ
-జోష్‌లో టీమ్‌ఇండియా.. అందరి చూపు రోహిత్ పైనే
-ఓడితే మరో చాన్స్ ఉండటానికి ఇది లీగ్ కాదు.. నాకౌట్.
-ఇక్కడ తడబడితే నేరుగా ఇంటికే.. మరో నాలుగేండ్లు నిరీక్షణే.

ముచ్చటగా మూడోసారి క్రికెట్ జగత్తుపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని భావిస్తున్న టీమ్‌ఇండియా సెమీఫైనల్‌కు సిద్ధమైంది. లీగ్ దశలో ఒక జట్టు మిగిలిన అన్ని జట్లతో ఆడేలా రౌండ్ రాబిన్ పద్ధతిని ప్రవేశపెట్టగా.. షెడ్యూల్లో భాగంగా జూన్ 13న భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రైద్దెంది. అప్పుడు తలపడని జట్లు నేడు తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రికార్డు స్థాయిలో 8 సార్లు సెమీస్ గడపతొక్కి గత టోర్నీలో ఫైనల్ చేరిన కివీస్ తుదిమెట్టుపై ఆసీస్ చేతిలో బోల్తాకొట్టింది. ఒత్తిడిని అధిగమించి ఈ సారి ఎలాగైనా విశ్వకప్పు పట్టేయాలని బ్లాక్‌క్యాప్స్ పట్టుదలగా ఉంటే.. క్రితం సారి సెమీస్‌లో ఓడినా.. చక్కటి ప్రదర్శనే చేసిన టీమ్‌ఇండియా ఈ సారి వదలకూడదని మొండికేస్తున్నది. 

Virat-Kohli

మాంచెస్టర్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ 10 జట్లు.. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కోటి తొమ్మిదేసి మ్యాచ్‌లు.. 38 రోజుల పాటు జరిగిన లీగ్‌లో మొత్తం 45 పోరాటాలు.. ఒత్తిడిని అధిగమించి నిలిచిన జట్లే నాకౌట్‌కు చేరాయి. మరో వారం రోజుల్లో ముగియనున్న మెగాటోర్నీలో కీలక అంకానికి మంగళవారం తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోని టీమ్‌ఇండియా.. నాలుగో స్థానంతో లీగ్ దశను ముగించిన న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరుగనుంది. భారత్ టాపార్డర్‌కు.. కివీస్ పేస్ అటాక్‌కు మధ్య సమరంగా భావిస్తున్న రసవత్తర పోరుకు ఓల్డ్ ట్రఫోర్డ్ వేదిక కానుంది. వరుస శతకాలతో మోత మోగిస్తున్న హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీని నిలువరిస్తే చాలని బ్లాక్‌క్యాప్స్ భావిస్తుంటే.. ప్లాన్‌బిసిద్ధంగా ఉంది కాచుకోండి అని కోహ్లీ అండ్ కో సై అంటున్నది. 1983 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇదే పిచ్‌పై ఇంగ్లండ్‌ను ఓడించిన కపిల్ సేన ఆ తర్వాత ఫైనల్లోనూ నెగ్గి జగజ్జేతగా నిలిచిన స్ఫూర్తితో టీమ్‌ఇండియా అడుగు ముందుకు వేయనుంది.

కూర్పేసమస్య

టీమ్ ఇండియా బ్యాటింగ్ మొత్తం తొలి మూడు స్థానాల చుట్టే తిరుగుతున్నది. జట్టును తేల్చాలన్నా వాళ్లే.. ముంచాలన్నా వాళ్లే. ఆ తర్వాత పంత్, పాండ్యా, ధోనీ.. ఆ ముగ్గురికి ఈ ముగ్గురు జతైతే భారత్‌కు అడ్డేఉండదు. కానీ గత కొంత కాలంగా ధోనీ స్థాయికి తగ్గ మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అనే వాదనలు పెరిగిపోతున్న తరుణంలో మహీ బ్యాట్ ఝలిపించాలని యావత్ భారతావని ఆశిస్తున్నది. అసలు సిసలు పోరుకు ముందు టీమ్‌ఇండియా జట్టు కూర్పు విషయంలో తర్జనభర్జన పడుతున్నది. ఐదుగురు బౌలర్లు చాలు అని కోహ్లీ అంటున్నా.. న్యూజిలాండ్‌పై మెరుగైన గణాంకాలు నమోదు చేసిన జాదవ్‌ను జట్టులోకి తీసుకునే చాన్సే ఎక్కువగా కనిపిస్తున్నది. విలియమ్సన్, లాథమ్‌ను రెండేసి సార్లు ఔట్ చేసిన జాదవ్ కివీస్‌పై మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. 

అదే జరిగితే.. కార్తీక్ తిరిగి బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. అయితే ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో వెళ్తారా లేక.. ఒకర్ని తప్పించి ఆ స్థానంలో జడేజా, లేదా అదనపు పేసర్‌కు చాన్స్ ఇస్తారా అనే అంశంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. బుమ్రాతో జాగ్రత్త అని ఆ జట్టు మాజీ కెప్టెన్ వెటోరీ ఇప్పటికే న్యూజిలాండ్ ఆటగాళ్లకు హెచ్చరించాడు. మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. నాకౌట్‌లో బుమ్రా ఇంకా ప్రమాదకరం అని అన్నాడు. ఇప్పటి వరకు ఇలాంటి అంచనాలను నిజం చేస్తూ వచ్చిన బుమ్రా మరోసారి తన యార్కర్ మ్యాజిక్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఆడిన మ్యాచ్‌లు తక్కువే అయినా.. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టపడేసిన షమీ ఈ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయేందుకు రెడీ అవుతున్నాడు. పాండ్యా స్లో బౌన్సర్లు జట్టుకు అదనపు ప్రయోజనం కల్పిస్తున్నాయి. గత మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌లో చాలా తప్పిదాలకు పాల్పడింది. దాన్ని సవరించుకుంటే తిరుగుండదు.

dhoni

ఈ ముగ్గురూ ఆ ముగ్గురూ

టాపార్డర్ బలంతోనే టీమ్‌ఇండియా విజయ ఢంకా మోగిస్తుందన్న విషయం జగద్విదితమే. ఓపెనర్లు రోహిత్ (647), రాహుల్ (359)తో పాటు వన్‌డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (441) పరుగుల వరద పారిస్తుండటంతో భారత్ అలవోకగా భారీ స్కోర్లు చేయగలుగుతున్నది. మెగాటోర్నీలో ఈ ముగ్గురు కలిసి 1447 పరుగులు సాధించారు. టోర్నీ ఆరంభంలో శతకంతో అలరించిన మరో ఓపెనర్ శిఖర్ ధవన్ దూరమైనా.. రాహుల్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్నాడనే చెప్పొచ్చు. మిడిలార్డర్‌కు పెద్దగా పనిపెట్టకుండా ఈ త్రయమే చెలరేగుతూ వస్తున్నది.. ఒకటీ అరా సందర్భాల్లో టాపార్డర్ విఫలమైతే.. బాధ్యత తీసుకునే అంశంలో మిడిల్ కాస్త తడబడుతున్నది. కీలక సెమీఫైనల్లోనూ మరోసారి ఈ ముగ్గురు విజృంభించి మొనగాళ్లని అనిపించుకుంటే.. భారత్‌కు తిరుగుండదు. న్యూజిలాండ్ పేసర్లు ఫెర్గూసన్ (17), బౌల్ట్ (15), హెన్రీ (10) కలిసి ఈ టోర్నీలో తీసిన వికెట్లు 42. బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపులు లేకున్నా కివీస్ సెమీస్ వరకు చేరడంలో వీరి పాత్ర చాలా ఉంది. ఈ ముగ్గురితో పాటు నీషమ్ (11), గ్రాండ్‌హోమ్ (5) కూడా ఓ చేయి వేస్తే భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. 

kane

ఆకాశమంత..

ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌అని పదే పదే అనే విరాట్ కోహ్లీ మరోమారు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై గౌరవాన్ని బయటపెట్టాడు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన మహీపై తనకు ఆకాశమంత గౌరవం ఉందని పేర్కొన్నాడు. నా దృష్టికోణంలో ధోనీ ఆకాశమంతటివాడు. అతడిపై నాకున్న గౌరవం కూడాఅలాంటిదే. ఒక జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా వ్యవహరించిన వ్యక్తి దాదాపు అదే జట్టులో సామన్య ఆటగాడిగా కొనసాగడం చిన్న విషయం కాదు. అది అతడికే సాధ్యం. కొత్త కెప్టెన్‌గా నాకు కావల్సినంత స్పేస్ ఇచ్చాడు. నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించాడు. ఇదంతా అతడిలోని మంచి గుణమే. అదే సమయంలో ఎలాంటి సందేహం అడిగినా సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు. 
– విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

3-4మెగాటోర్నీలో భారత్, న్యూజిలాండ్ 7సార్లు తలపడగా.. భారత్ 3, కివీస్ 4 మ్యాచ్‌లు నెగ్గాయి.
1/7ఏడుసార్లు విశ్వసమరం సెమీస్ చేరిన న్యూజిలాండ్ ఒక్కసారి నెగ్గి ఆరుసార్లు ఓడింది.
3/6ప్రపంచకప్‌లో ఆరుసార్లు సెమీస్ చేరిన భారత్.. మూడింట గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. 
26మరో 26 రన్స్ చేస్తే రోహిత్ (647) ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ (673)సరసన నిలుస్తాడు.
350 మహేంద్రసింగ్ ధోనీకిది 350వ వన్డే.

ఒకే ఒక్కడు..

మెగాటోర్నీలో ఓ జట్టు చేసిన మొత్తం పరుగుల్లో ఒక్క బ్యాట్స్‌మెన్ వాటా పరంగా చూసుకుంటే.. విలియమ్సన్ అందరి కంటే ముందున్నాడు. కివీస్ స్కోర్లలో 30.23 శాతం ఒక్క కేన్ బ్యాట్‌నుంచే వచ్చాయి. పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ (29.05) కూడా ఈ అంశంలో విలియమ్సన్ కంటే వెనుకే ఉన్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు న్యూజిలాండ్ జట్టు అతడిపై ఎంతగా ఆధారపడుతున్నదో చెప్పడానికి. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సహచరులంతా వెనుదిరిగినా.. తీవ్ర ఒత్తిడిలో కూడా అదరక బెదరక ఎదురు నిలిచిన కేన్ అద్భుత శతకంతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో కేన్ ఇప్పటి వరకు 481 పరుగులు చేస్తే.. కివీస్ తరఫున రెండో స్థానంలో ఉన్న రాస్ టేలర్ 261 పరుగులే చేశాడు. గప్టిల్ (166), మున్రో (125) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు మార్టీన్, హెన్రీ టచ్‌లోకి రావడంతో పాటు టేలర్, లాథమ్ కూడా రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తున్నది. ఆల్‌రౌండర్లు, నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్ అటు బాల్‌తో ఇటు బ్యాట్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ పోరులోనూ అదే జోరు కొనసాగిస్తే.. కివీస్‌కు తిరుగుండదు. తొడ కండరాలు పట్టేయడంతో గత మ్యాచ్‌కు దూరమైన పేసర్ ఫెర్గూసన్ తిరిగి జట్టుతో చేరడం కివీస్ బలాన్ని రెట్టింపు చేసేదే. మేఘావృతమైన వాతావరణంలో బౌల్ట్‌ను ఎదుర్కోవడం భారత ఓపెనర్లకు సవాలుతో కూడుకున్న పనే. 

పిచ్, వాతావరణం

గత కొన్ని మ్యాచ్‌లుగా ఓల్డ్ ట్రఫోర్డ్ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుస్తున్నది. వికెట్ బ్యాటింగ్‌తో పాటు పేస్‌కు అనుకూలం. మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది.
ఫెర్గూసన్ ఇటీవల అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా మెగాటోర్నీలో అవసరమైనప్పుడల్లా వికెట్లు పడగొట్టి జట్టుకు బ్రేక్‌త్రూ అందిస్తున్నాడు. నా దృష్టిలో మా జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఇది మాకు మేలు చేసే అంశమే. . టీమ్‌ఇండియాలో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
-గ్యారీ స్టీడ్, న్యూజిలాండ్ కోచ్

వానొస్తే..

మాంచెస్టర్‌లో మంగళవారం వర్ష సూచన ఉందని బ్రిటన్ వాతావరణ శాఖ అంటోంది. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు ముంచేసిన విషయం తెలిసిందే. అయితే నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉన్నా.. బుధవారం ఇంకా ఎక్కువ వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వరుణుడి కారణంగా రెండు రోజుల్లోనూ మ్యాచ్ సాధ్యంకాకపోతే.. లీగ్ దశలో అధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. 8 మ్యాచ్‌లాడి ఏడింట గెలిచిన టీమ్‌ఇండియా 15 పాయింట్లతో ఉంటే.. న్యూజిలాండ్ 8 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి 11 పాయింట్లతో సెమీస్ చేరిన విషయం తెలిసిందే. 

తుది జట్లు (అంచనా)

భారత్: రాహుల్, రోహిత్, కోహ్లీ (కెప్టెన్), పంత్, ధోనీ, పాండ్యా, కార్తీక్/జాదవ్, భువనేశ్వర్/షమీ, కుల్దీప్, చహల్, బుమ్రా.
న్యూజిలాండ్: గప్టిల్, నికోల్స్, విలియమ్సన్, టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, ఫెర్గూసన్, హెన్రీ, బౌల్ట్.

rohit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *