సెమీస్‌లో భారత్

-బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం 
-సగర్వంగా.. సెమీస్‌కు
-బంగ్లాపై విజయంతో వరుసగా మూడోసారి నాకౌట్ చేరిన భారత్
-రోహిత్ రికార్డు సెంచరీ.. మెరిసిన బుమ్రా, పాండ్యా,రాహుల్

ఓపెనర్లు మరోసారి అదరగొట్టారు. హిట్‌మ్యాన్ రోహిత్ మెగాటోర్నీలో నాలుగో సెంచరీతో రెచ్చిపోతే.. లోకేశ్ రాహుల్ చక్కటి ఇన్నింగ్స్‌తో విలువ చాటుకున్నాడు. వరుస అర్ధశతకాలతో జోరుమీదున్న విరాట్ ఆకట్టుకోలేకపోయినా.. యంగ్ తరంగ్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. ధోనీ టెస్టు ఇన్నింగ్స్‌తో మరోసారి విసిగించినా.. భారత్ భారీ స్కోరే చేసింది. సంచలనాలకు కేంద్రబిందువైన బంగ్లా మ్యాజిక్ చేసేలా కనిపించినా.. బ్యాట్‌తో పవర్ చూపెట్టలేకపోయిన పాండ్యా బంతితో కీలక వికెట్లు తీసి బదులు తీర్చుకున్నాడు. పోరాడిన లోయర్ ఆర్డర్‌ను యార్కర్‌లతో బుమ్రా బెంబేలెత్తించాడు. ఫలితంగా భారత్ వరుసగా మూడోసారి సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టగా.. బంగ్లాదేశ్ కట్టుకున్న కలల సౌధం కుప్పకూలింది.

rohit-sharma

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ టైటిల్ వేటలో మరో ముందడుగు వేసింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో ఆఖరివరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 28 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రోహిత్‌శర్మ (104) రికార్డు సెంచరీకి తోడు రాహుల్ (77) రాణింపుతో పోరాడే స్కోరు అందుకున్న భారత్.. బంగ్లా పనిపట్టింది. బుమ్రా (4/55), హార్దిక్ (3/60) విజృంభణతో మరో మ్యాచ్ మిగిలుండగానే నాకౌట్ బెర్తు దక్కించుకున్నది. బంగ్లా ఆటగాళ్లు షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. 

india-cricket

బర్మింగ్‌హామ్: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. రెండు రోజుల క్రితం ఏ పిచ్‌పై ఓటమి వెక్కిరించిందో.. అక్కడే టీమ్‌ఇండియా జయకేతనం ఎగురవేసింది. ఇంగ్లండ్ మ్యాచ్‌కు యాక్షన్ రీప్లేలా సాగిన పోరులో భారత్ జయభేరి మోగించి దర్జాగా సెమీఫైనల్లో అడుగుపెడితే.. 2007 ప్రపంచకప్‌లో మనకు భారీ షాక్ ఇచ్చిన బంగ్లా మాత్రం నిరాశగా ఇంటిబాటపట్టింది. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై నెగ్గినా బంగ్లా నాకౌట్ దశకు చేరే అవకాశాలు లేవు. మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌పై జరిగిన మ్యాచ్‌లో విరాట్ సేన 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. 

Hardik

రోహిత్ శర్మ (92 బంతుల్లో 104; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రికార్డు స్థాయిలో ప్రపంచకప్‌లో నాలుగో సెంచరీ నమోదు చేయగా.. లోకేశ్ రాహుల్ (92 బంతుల్లో 77; 6 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (41 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టారు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ (5/59) ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ అల్ హసన్ (74 బంతుల్లో 66; 6 ఫోర్లు), సైఫుద్దీన్ (38 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు) పోరాటం ఫలితాన్నివ్వలేదు. భారత బౌలర్లలో బుమ్రా (4/55), పాండ్యా (3/60) రాణించారు. రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

పోరాడిన షకీబ్..

గత మూడు మ్యాచ్‌ల్లో తన పేస్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్న మొహమ్మద్ షమీ ఈ పోరులోనూ టీమ్‌ఇండియాకు శుభారంభం అందించాడు. చక్కటి షాట్లతో ముందుకు సాగుతున్న ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (22)ను బౌల్డ్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. మరోవైపు యార్కర్ కింగ్ బుమ్రా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడంతో తొలి పవర్ ప్లే ముగిసేసరికి బంగ్లా 40/1తో నిలిచింది. మరో ఓపెనర్ సౌమ్యా సర్కార్ (33; 4 ఫోర్లు) ఔటైనా.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న షకీబ్ మాత్రం చక్కటి షాట్లతో అలరించాడు. మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించాక ముష్ఫికర్ రహీమ్ (24; 3 ఫోర్లు) వెనుదిరిగినా.. ఒక దశలో బంగ్లా 162/3తో పటిష్ఠంగానే కనపించింది. 

Bumrah

అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షకీబ్ క్రీజులో ఉండటంతో మొర్తజా సేన పోటీలోనే నిలిచింది. అయితే లిటన్ దాస్ (22), మొసద్దిక్ (3) వెంట వెంటనే ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువవుతున్న తరుణంలో పాండ్యా బౌలింగ్‌లో షకీబ్ వెనుదిరగడంతో బంగ్లాకు భారీ షాక్ తగిలింది. చివర్లో షబ్బీర్ (36; 5 ఫోర్లు), సైఫుద్దీన్ (38 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు) భయపెట్టినా.. బుమ్రా చక్కటి బంతులతో షబ్బీర్, రూబెల్ (9), ముస్తఫిజుర్ (0) కథ ముంగిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Rahul

ఆఖరి 10 ఓవర్లలో 63/5..

38 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 237/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లు వెనుదిరిగినా.. కోహ్లీ (26; 3 ఫోర్లు), పంత్ క్రీజులో ఉండటంతో ఇక తిరుగులేదనిపించింది. అయితే తదుపరి ఓవర్‌లో ముస్తఫిజుర్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. మూడు బంతుల వ్యవధిలో విరాట్‌తో పాటు పాండ్యా (0)ను పెవిలియన్ పంపాడు. పంత్ ప్రతాపం చూపినా.. మరో ఎండ్‌లో ధోనీ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. ఇదే అదునుగా బంగ్లా ఒత్తిడి పెంచడంతో పరుగుల రాక గగనమైంది. దీంతో సిక్సర్‌కు యత్నించిన పంత్ క్యాచ్ ఔటయ్యాడు. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న కార్తీక్ (8) ఆకట్టుకోలేకపోగా.. కొన్ని షాట్లు ఆడిన ధోనీ ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు. భారత్ చివరి 10 ఓవర్లలో 63 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది. 

rohit-sharma2

రికార్డు ఓపెనింగ్..

ఇంగ్లండ్‌తో మ్యాచ్ అనుభవం మదిలో మెదులుతుండగా.. టాస్ గెలిచిన కోహ్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఓపెనర్లు జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ప్రపంచకప్‌లోనే భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (180 పరుగులు) నమోదు చేసిన రోహిత్, రాహుల్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఈ జోరు చూస్తుంటే భారీ స్కోరు పక్కా అనిపించినా.. ఆఖర్లో వేగంగా ఆడలేకపోవడంతో అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. సిక్సర్‌తో ఖాతా తెరిచి న రోహిత్.. ఆ తర్వాత ఎక్కడా జోరు తగ్గించకపోగా రాహుల్ కూడా సాధికారికంగా ఆడాడు. 

ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్ట పోకుండా 69 పరుగులు చేసింది. ఈ క్రమంలో మొదట రోహిత్ శర్మ 45 బంతుల్లో.. ఆ తర్వాత లోకేశ్ 57 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అక్కడి నుంచి గేరు మార్చిన రోహిత్ భారీ సిక్సర్లతో విరుచుకుపడి చూస్తుండగానే శతకానికి చేరువయ్యాడు. సెంచరీ ముందు కాస్త నెమ్మదించి నా 90 బంతుల్లో ఈ ప్రపంచకప్‌లో నాలుగోసారి మూ డంకెల మార్క్ దాటిన వెంటనే ఔటయ్యాడు. కాసేపటికే రాహుల్ కూడా వెనుదిరిగాడు.

మిస్సైతే సెంచరీనే..

ఈ మెగాటోర్నీలో రోహిత్ నాలుగు సెంచరీలు బాదడం వెనుక ఓ సారూప్యత కనిపిస్తున్నది. ఆరంభంలో క్యాచ్ మిస్ అయిన ప్రతీసారి లైఫ్‌ను వినియోగించుకున్న హిట్‌మ్యాన్ దాన్ని భారీ స్కోరుగా మలిచాడు. తాజా మ్యాచ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తమీమ్ ఇక్బాల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ ఆ తర్వాత చితక్కొట్టాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగుల వద్ద రూట్ క్యాచ్ మిస్ చేయడాన్ని వాడుకొని102 పరుగులు కొట్టిన అతడు.. దక్షిణాఫ్రికాపై 1 పరుగు వద్ద క్యాచ్ మిస్ అయిన తర్వాత అజేయ శతకం (122 నాటౌట్) బాదాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 32 పరుగుల వద్ద సులువైన రనౌట్ చాన్స్ నుంచి తప్పించుకున్న రోహిత్ భారీ శతకం(140)తో విజృంభించగా.. ఆసీస్‌పైనా 2 పరుగుల వద్ద క్యాచ్ మిస్ అవడంతో బతికిపోయి చక్కటి ఇన్నింగ్స్ (57)తో ఆకట్టుకున్నాడు. 

4

ఒకే ప్రపంచకప్‌లో 4 సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో సంగక్కర (2015లో) మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. భారత్ తరఫున గంగూలీ (2003లో) అత్యధికంగా 3 శతకాలు నమోదు చేశాడు.

2

విశ్వసమరంలో రోహిత్ 5 సెంచరీలతో పాంటింగ్, సంగక్కరతో కలిసి రెండో స్థానానికి చేరాడు. సచిన్ (6) అగ్రస్థానంలో ఉన్నాడు. 

2

మన దేశం తరఫున ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ (544) నిలిచాడు. సచిన్ (2003లో 673 పరుగులు) టాప్‌లో ఉన్నాడు.

1

ప్రపంచకప్ చరిత్రలో 500 పరుగులు, 10 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా షకీబ్ రికార్డు సృష్టించాడు. గతంలో స్కాట్ ైస్టెరీస్ (న్యూజిలాండ్; 499 పరుగులు, 10 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శనను వెనక్కి నెట్టాడు.

180

ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. గతంలో 2015 టోర్నీలో ఐర్లాండ్‌పై రోహిత్-ధవన్ నమోదు చేసిన 174 పరుగులు రెండో స్థానానికి చేరింది.

నాకౌట్ చేరడం ఆనందంగా ఉంది. గ్రౌండ్ పరిస్థితులను దృష్టి పెట్టుకునే ఐదుగురు బౌలర్లతో బరిలోదిగాం. చాలా ఏండ్లుగా రోహిత్‌ను గమనిస్తున్నా.. వన్డేల్లో అతడు అత్యుత్తమ బ్యాట్స్‌మన్. బుమ్రా ఓవర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయని ముందే అనుకున్నా. 
– కోహ్లీ, భారత కెప్టెన్

kohli

అభిమానానికి వయసు అడ్డంకి కాదని మరోమారు నిరూపితమైంది. తమ జాతీయ జట్టు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఖండాంతరాలు దాటే అభిమానులు కొందరైతే.. ముదిమి వయసులోనూ ఆటను ఆస్వాదించేవాళ్లు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిందే 87 ఏండ్ల చారులత పటేల్ అనే బామ్మ. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఈ బామ్మ చేసిన సందడి అంతా..ఇంతా కాదు. స్టాండ్స్‌లో ఫ్యాన్స్‌తో కలిసి పీక ఊదుతూ ఎంజాయ్ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ బామ్మ.. కెప్టెన్ కోహ్లీని కలుసుకుని కొద్దిసేపు మాట్లాడింది. 

KTR-tweet

సెమీఫైనల్‌కు అర్హత సాధించిన టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు. ప్రపంచకప్‌ను దేశానికి తీసుకొచ్చేందుకు మరో రెండు విజయాల దూరమే ఉంది. గుడ్‌లక్ బాయ్స్ 
– కేటీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ 

స్కోరు బోర్డు

భారత్: రాహుల్ (సి) ముష్ఫికర్ (బి) రూబెల్ 77, రోహిత్ (సి) లిటన్ (బి) సర్కార్ 104, కోహ్లీ (సి) రూబెల్ (బి) ముస్తఫిజుర్ 26, పంత్ (సి) మొసద్దిక్ (బి) షకీబ్ 48, పాండ్యా (సి) సర్కార్ (బి) ముస్తఫిజుర్ 0, ధోనీ (సి) షకీబ్ (బి) ముస్తఫిజుర్ 35, కార్తీక్ (సి) మొసద్దిక్ (బి) ముస్తఫిజుర్ 8, భువనేశ్వర్ (రనౌట్) 2, షమీ (బి) ముస్తఫిజుర్ 1, బుమ్రా (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 50 ఓవర్లలో 314/9. వికెట్ల పతనం: 1-180, 2-195, 3-237, 4-237, 5-277, 6-298, 7-311, 8-314, 9-314, బౌలింగ్: మొర్తజా 5-0-36-0, సైఫుద్దీన్ 7-0-59-0, ముస్తఫిజుర్ 10-1-59-5, షకీబ్ 10-0-41-1, మొసద్దిక్ 4-0-32-0, రూబెల్ 8-0-48-1, సర్కార్ 6-0-33-1.

బంగ్లాదేశ్: తమీమ్ (బి) షమీ 22, సర్కార్ (సి) కోహ్లీ (బి) పాండ్యా 33, షకీబ్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 66, ముష్ఫికర్ (సి) షమీ (బి) చహల్ 24, లిటన్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 22, మొసద్దిక్ (బి) బుమ్రా 3, షబ్బీర్ (బి) బుమ్రా 36, సైఫుద్దీన్ (నాటౌట్) 51, మొర్తజా (సి) ధోనీ (బి) భువనేశ్వర్ 8, రూబెల్ (బి) బుమ్రా 9, ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 48 ఓవర్లలో 286 ఆలౌట్. వికెట్ల పతనం: 1-39, 2-74, 3-121, 4-162, 5-173, 6-179, 7-245, 8-257, 9-286, 10-286, బౌలింగ్: భువనేశ్వర్ 9-0-51-1, బుమ్రా 10-1-55-4, షమీ 9-0-68-1, చహల్ 10-0-50-1, పాండ్యా 10-0-60-3.

table

runs

wickets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *