బిగ్‌బాస్ షో నిలిపేంత వరకు పోరాటం ఆగదు

హైదరాబాద్: బిగ్‌బాస్‌ను నిలిపివేయకుంటే మహిళా, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం నిర్వహిస్తానని యాంకర్, జర్నలిస్టు శ్వేతా రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటీ, యాంకర్ గాయాత్రి గుప్తా, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి మాట్లాడారు. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, మహిళల ఆత్మాభిమాన్ని కించపరిచేలా షోను నిర్వహిస్తున్నారన్నారు. తాను చేస్తున్న పోరాటానికి ప్రజాప్రతినిధులు, పార్టీలు, మహిళా, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. ఇప్పటికే నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టును ఆశ్రయించారని, ఈ నెల 29 కేసు హియరింగ్ ఉందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హన్మంత రావు సైతం తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచారని తెలిపారు. చిత్ర రంగంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా నిర్వహించడం సరికాదని, తమిళనాడులో సైతం రాజకీయ పార్టీ పెట్టి మార్పులు తీసుకువస్తానని ప్రకటించిన నటుడు కమల్ హాసన్ కూడా హోస్ట్‌గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో తమిళనాడుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారని, తాను, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్వరి ప్రియాతో ప్రధానిని కలిసి ఈ సమస్యపై వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *