నయా సైనికుడు

-కరీబియన్లను బెంబేలెత్తించిన నవదీప్‌.. 
-బ్యాటింగ్‌లో తడబడ్డ టీమ్‌ఇండియా తొలి టీ20లో విండీస్‌పై విజయం.. 
-నేడు రెండో మ్యాచ్‌

దాదాపు మూడేండ్ల క్రితం భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఇక్కడే జరిగిన మ్యాచ్‌లో 489 పరుగులు నమోదయ్యాయి. ఇరు జట్ల ఆటగాళ్లు కలిపి రెండు సెంచరీలు.. రెండు అర్ధసెంచరీలు బాది ప్రేక్షకులకు ఫుల్‌ మజా పంచారు. అదే పిచ్‌పై శనివారం జరిగిన మ్యాచ్‌ మరీ చప్పగా సాగింది. శతకం మాట అటుంచి.. రెండు టీమ్‌ల్లో కలిపి ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా కనీసం అర్ధశతకం నమోదు చేయలేకపోయాడు. యువ పేసర్‌ నవదీప్‌ సైనీఅరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శన చేయడంతో.. పరుగులు రాబట్టేందుకు కరీబియన్లు పరితపించిపోయారు. పోలార్డ్‌ మినహా మిగిలిన వారంతా విఫలమవడంతో విండీస్‌ స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. ఆ కొద్దిపాటి లక్ష్యాన్ని ఛేదించేందుకు మనవాళ్లూఆపసోపాలు పడ్డారు. 

లాడర్‌హిల్‌ (అమెరికా):వన్డే ప్రపంచకప్‌ పరాజయం అనంతరం అనేక సమస్యల మధ్య వెస్టిండీస్‌తో పొట్టి పోరుకు దిగిన టీమ్‌ఇండియా చక్కటి విజయాన్ని అందుకుంది. శనివారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ‘మిడిలార్డర్‌లో మంచి బ్యాట్స్‌మన్‌ కావాలి.. నిలకడగా ఆడే ఆటగాడి కోసం చూస్తున్నాం’అని మ్యాచ్‌కు ముందు అన్న కోహ్లీ తీరా బరిలో దిగే సమయానికి ఉన్న బ్యాట్స్‌మెన్‌ నుంచి ఒకర్ని తగ్గించి ఆరుగురు బౌలర్లు, ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తో తుదిజట్టును ప్రకటించాడు. ఈ ఫార్ములా ఫలించి ఆరంభంలో విండీస్‌ వీరులు తక్కువ పరుగులకే పరిమితమైనా.. లక్ష్య ఛేదనలో మరో బ్యాట్స్‌మన్‌ లోటు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది. 

అరంగేట్ర పేసర్‌ నవదీప్‌ సైనీ (3/17)తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌ (2/19) విజృంభించడంతో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ (49 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుగ్గా ఆడగా.. పూరన్‌ (20) మినహా మిగిలినవారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. టాప్‌ఆర్డర్‌లోనే ముగ్గురు సున్నాలు చుట్టారు. సుందర్‌, ఖలీల్‌, కృనాల్‌, జడేజా తలా ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం భారత్‌ 17.2 ఓవర్లలో 6 వికెట్లకు 98 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. సైనీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే రెండో టీ 20 జరుగనుంది. ఇదే పిచ్‌పై.. ఇదే ప్రత్యర్థితో ఆడిన చివరి మ్యాచ్‌లో అజేయ శతకంతో ఆకట్టుకున్న లోకేశ్‌ రాహుల్‌కు తుది జట్టులో చోటుదక్కక పోగా.. యువ పేసర్‌ నవదీప్‌ సైనీ భారత్‌ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

rohit

కష్ట కష్టంగానే..

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్‌ అతి జాగ్రత్తకు పోయినట్లు కనిపించింది. 10 ఓవర్లలో ఛేదించాల్సిన టార్గెట్‌ను మరీ నెమ్మదిగా పూర్తిచేసింది. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (1)ను రెండో ఓవర్లో కాట్రెల్‌ ఔట్‌ చేశాడు. అయినా కెప్టెన్‌ కోహ్లీ (00), వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ (24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉండటంతో కాసేపట్లోనే మ్యాచ్‌ ముగిసిపోతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లే రోహిత్‌ చక్కటి షాట్లతో మంచి టచ్‌లో కనిపించాడు. ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి టీమ్‌ ఇండియా వికెట్‌ నష్టానికి 31 వికెట్లు పడగొట్టింది. కానీ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ వరుస బంతుల్లో రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌ను పెవిలియమన్‌ పంపాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 33/3తో నిలిచింది. ఈ దశలో మనీశ్‌ పాండే (19)తో కలిసి కోహ్లీ నెమ్మదిగా జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. 5 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ ఔటైనా.. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో కృనాల్‌ (12), జడేజా (10 నాటౌట్‌), సుందర్‌ (8 నాటౌట్‌) మిగిలిన పని పూర్తి చేశారు. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, నరైన్‌, పాల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

hetmyer

సైకిల్‌ స్టాండ్‌ను తలపిస్తూ..

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోహ్లీ నిర్ణయం సరైందని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. యువ బౌలర్లు రెచ్చిపోవడంతో విండీస్‌ విలవిల్లాడింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ (0)ను వాషింగ్టన్‌ సుందర్‌ వెనక్కి పంపి టీమ్‌ఇండియాకు శుభారంభం అందించాడు. విధ్వంసకర ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (0)ను నకుల్‌ బాల్‌తో బోల్తా కొట్టించిన భువనేశ్వర్‌ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఎదురుదాడికి యత్నించిన నికోలస్‌ పూరన్‌ (20; 1 ఫోర్‌, 2 సిక్సర్లు)తో పాటు హెట్‌మైర్‌ (0)ను అరంగేట్ర పేసర్‌ నవదీప్‌ సైనీ వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. కాసేపటికే పావెల్‌ (4)ను ఖలీల్‌ ఔట్‌ చేశాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి విండీస్‌ 33 పరగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

పొలార్డ్‌ నిలిచినా..

ఈ దశలో సీనియర్‌ ఆటగాళ్లు పొలార్డ్‌, బ్రాత్‌వైట్‌ సంయమనం ప్రదర్శించారు. మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఆనక పరుగులు రాబట్టడంపై దృష్టిసారించారు. ఆరో వికెట్‌కు 34 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దుతున్న తరుణంలో కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ (9)ను కృనాల్‌ రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా డగౌట్‌కు పంపాడు. ఒక ఎండ్‌లో పొలార్డ్‌ పోరాడుతున్నా మరో ఎండ్‌ నుంచి అతడికి సహకారం కరువైంది. నరైన్‌ (2), పాల్‌ (3) ప్రభావం చూపలేకపోయారు. ఆఖర్లో బ్యాట్‌కు పనిచెప్పిన పొలార్డ్‌ జట్టుకు ఆ మాత్రం స్కోరైనా అందించగలిగాడు. చివరి ఓవర్‌లో మరోసారి మాయ చేసిన సైనీ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా పొలార్డ్‌ను ఔట్‌ చేయడంతో విండీస్‌ సెంచరీ మార్క్‌ను కూడా దాటలేకపోయింది.

స్కొరు బోర్డు

వెస్టిండీస్‌: క్యాంప్‌బెల్‌ (సి) కృనాల్‌ (బి) సుందర్‌ 0, లూయిస్‌ (బి) భువనేశ్వర్‌ 0, పూరన్‌ (సి) పంత్‌ (బి) సైనీ 20, పొలార్డ్‌ (ఎల్బీ) సైనీ 49, హెట్‌మైర్‌ (బి) సైనీ 0, పావెల్‌ (సి) పంత్‌ (బి) ఖలీల్‌ 4, బ్రాత్‌వైట్‌ (సి అండ్‌ బి) కృనాల్‌ 9, నరైన్‌ (సి) ఖలీల్‌ (బి) జడేజా 2, పాల్‌ (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్‌ 3, కాట్రెల్‌ (నాటౌట్‌) 0, థామస్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 95/9. వికెట్ల పతనం: 1-0, 2-8, 3-28, 4-28, 5-33, 6-67, 7-70, 8-88, 9-95, బౌలింగ్‌: సుందర్‌ 2-0-18-1, భువనేశ్వర్‌ 4-0-19-2, సైనీ 4-1-17-3, ఖలీల్‌ 2-0-8-1, కృనాల్‌ 4-1-20-1, జడేజా 4-1-13-1.

భారత్‌: రోహిత్‌ శర్మ (సి) పొలార్డ్‌ (బి) నరైన్‌ 24, శిఖర్‌ ధవన్‌ (ఎల్బీ) కాట్రెల్‌ 1, విరాట్‌ కోహ్లీ (సి) పొలార్డ్‌ (బి) కాట్రెల్‌ 19, పంత్‌ (సి) కాట్రెల్‌ (బి) నరైన్‌ 0, మనీశ్‌ (బి) పాల్‌ 19, కృనాల్‌ (బి) పాల్‌ 12, జడేజా (నాటౌట్‌) 10, సుందర్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 17.2 ఓవర్లలో 98/6. వికెట్ల పతనం: 1-4, 2-32, 3-32, 4-64, 5-69, 6-88, బౌలింగ్‌: థామస్‌ 4-0-29-0, కాట్రెల్‌ 4-0-20-2, నరైన్‌ 4-0-14-2, పాల్‌ 3.2-0-23-2, బ్రాత్‌వైట్‌ 2-0-12-0.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *