గ్రామవికాస విప్లవం

– టార్గెట్ అరవై రోజులు
-గుణాత్మక మార్పే లక్ష్యంగా అన్ని గ్రామాల్లో పక్కా కార్యాచరణ
-పచ్చదనం, పరిశుభ్రతే ప్రధాన లక్ష్యం 
-గ్రామాభివృద్ధిలో పంచాయతీరాజ్‌ది ప్రధానపాత్ర సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లదే కీలకభూమిక 
-గ్రామకార్యదర్శులకు ముఖ్య బాధ్యతలువిధుల్లో నిర్లక్ష్యంపై కఠినచర్యలు 
-కార్యాచరణ పర్యవేక్షణకు 100 ఫ్లయింగ్ స్కాడ్లు
– పుట్టగానే కుల, జనన ధ్రువీకరణ పత్రాలు 
-ఆర్నెళ్లలో విధిగా శ్మశానవాటికల ఏర్పాటు
-కరంట్ సమస్యల పరిష్కారానికి పవర్ వీక్
-ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
-పాల్గొన్న మంత్రి దయాకర్‌రావు, అధికారులు, సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం కోసం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 60 రోజుల కార్యాచరణ అమలులో భాగంగానే పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని తెలిపారు. గ్రామవికాస కార్యాచరణలో పంచాయతీరాజ్ శాఖది క్రియాశీలక పాత్ర కాబట్టి, ఈ శాఖను ప్రభుత్వం సంస్థాగతంగా బలోపేతం చేస్తుందని చెప్పారు. పంచాయతీరాజ్, మండల, జిల్లా పరిషత్‌లలో పోస్టులను భర్తీచేస్తామని సీఎం ప్రకటించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు ఏమేమి పనులు చేయాలో స్పష్టంగా నిర్వచించుకొని ఎవరి విధులు వారు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల వికాసం కోసం ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని తీసుకొస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గ్రామపంచాయతీల్లో ఎవరికి ఎలాంటి అధికారాలు, విధులుంటాయో, ఏ విధంగా నిధులు సమకూరుతాయో స్పష్టంగా పేర్కొంటూ పంచాయతీరాజ్ చట్టం రూపొందించామని, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తమ విధులు నిర్వర్తించి గ్రామాభివృద్ధికి పాటుపడటానికి ఇది చక్కని అవకాశమని సీఎం అన్నారు. గ్రామపంచాయతీల్లో అమలుచేయాల్సిన 60 రోజుల కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో అధికారులు, సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

గుణాత్మక మార్పు రావడమే లక్ష్యం

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదు. వివిధ రూపాల్లో ఎన్నో వేల కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఫలితం కానరావడం లేదు. గ్రామాల్లో ఎక్కడ సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను బాగుచేసుకొనే పద్ధతి రావడం లేదు. ఈ పరిస్థితిలో గుణాత్మక మార్పు రావాలి. అందుకోసమే కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాం. అధికారులు, ప్రజాప్రతినిధులపై ఖచ్చితమైన బాధ్యతలు పెట్టాం. ఎవరేం పనిచేయాలో నిర్దేశించాం. అవసరమైన అధికారాలిచ్చాం. కావాల్సిన నిధులను బడ్జెల్లోనే కేటాయించాం. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై కఠినచర్యలు తీసుకొనే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పించింది. కొత్త చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుచేసే విషయంలో ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఎవరినీ ఉపేక్షించదు. గ్రామాల్లో గుణాత్మక మార్పు తేవడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఏమిచేయాలో అది చేస్తాం అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. 

అన్ని పంచాయతీలకు డీపీవోలు

అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో) నియమించాలి. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున డీఎల్పీవోలను నియమించాలి. ప్రతి మండలానికి ఒక మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) ని నియమించాలి. ఈవోపీఆర్ అండ్ ఆర్డీ అనే పేరును తీసేసి, ఎంపీవోగా మార్చాలి. ఎంపీడీవో, సీఈవో పోస్టులను భర్తీచేయాలి. పోస్టులను భర్తీచేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులివ్వాలి. శాఖాపరంగానే కొత్త నియామకాలు చేపట్టాలి. ప్రక్రియ అంతా చాలా వేగంగా జరుగాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

పచ్చదనం, పరిశుభ్రతపైనే దృష్టిపెట్టాలి

గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి, ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం, పరిశుభ్రతను పెంచే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నందున గ్రామపంచాయతీలపై పెద్ద భారం దిగిపోయిందని, కరంటు, సాగునీటి కల్పన, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యంలాంటి ప్రధాన సమస్యలన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నదని, గ్రామ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుచేయాలని ఆదేశించారు. 60 రోజుల తర్వాత ముఖ్యఅధికారుల నేతృత్వంలోని 100 ఫ్లయింగ్ స్వాడ్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఆకస్మిక తనిఖీలు చేస్తాయన్నారు. ఏ గ్రామంలో అయితే 60 రోజుల కార్యాచరణలో నిర్దేశించిన పనులు చేపట్టలేదో అక్కడ సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. 

ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, పంచాయతీరాజ్ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు రొనాల్డ్‌రాస్, వెంకట్రామిరెడ్డి, ఎం సత్యనారాయణ, వీ వెంకటేశ్వర్లు, అమయ్‌కుమార్.. సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిరిసిల్ల్ల జిల్లాల పంచాయతీ అధికారులు సురేశ్‌బాబు, పద్మరాణి, రవికుమార్, వీ వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డీపీవో లింబగిరి స్వామి, ఈవోపీఆర్ అండ్ ఆర్డీలు బీ శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్‌చందర్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాచిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CMKCR1

ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లకు కలిసిరండి

-వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర..
-ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యాలు
-పర్యాటకరంగ అభివృద్ధిలోనూ భాగస్థులు కండి
-ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురితో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ : పెద్దఎత్తున ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే అంశంలో ప్రభుత్వంతో కలిసిరావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఐటీసీ ప్రతినిధులను కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించడంతోపాటు ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఆహారపదార్థాలు అందించే లక్ష్యంతో పెద్దఎత్తున ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురి, ఈడీ నకుల్ ఆనంద్, సీనియర్ అధికారులు సంజయ్‌సింగ్, ఉషారాణి శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీసీ ప్రతినిధులు పలు అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో రూ.800 కోట్ల వ్యయంతో ఐటీసీ చేపట్టిన ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణపనులు పూర్తయ్యాయని, రెండుమూడు నెలల్లో ఈ యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

తెలంగాణలో అతిపెద్ద ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌ను తక్కువ సమయంలోనే నిర్మించినందుకు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వారిని అభినందించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడంతోపాటు ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలు అందడంకోసం పెద్దఎత్తున ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, ఈ లక్ష్యసాధనకు ఈ రంగంలో అనుభవం కలిగిన ఐటీసీ కలిసిరావాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాలున్నాయని, ముడిసరుకు సేకరణలో, ఇతరత్రా అంశాల్లో మహిళల సేవలను వినియోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని, దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. ములుగు జిల్లాలో రేయాన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐటీసీ చొరవచూపాలని సీఎం కోరగా.. ఐటీసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. 

పర్యాటక అభివృద్ధిలోనూ భాగస్థులు కండి

రాష్ట్రంలో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తిచేస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 500 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయాలు సిద్ధమవుతున్నాయని, వాటిచుట్టూ అందమైన ప్రకృతి ఆకృతిదాలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సహజసిద్ధమైన అడవులున్నాయని, చారిత్రక ప్రదేశాలున్నాయని, ఇవన్నీ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందే అవకాశం ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని, వాటిలో కూడా ఐటీసీ కలిసిరావాలని సీఎం కేసీఆర్ కోరారు.

60 రోజుల కార్యాచరణలో చేపట్టాల్సిన పనులు

-గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి. 
-కూలిపోయిన ఇండ్లు, పాడైపోయిన పశువుల కొట్టాల శిథిలాలను పూర్తిగా తొలిగించాలి. 
-పాడుపడిన బావులను, నీటి బొందలను పూడ్చేయాలి. ఇందుకు నరేగా నిధులు వాడుకోవాలి. దోమల మందు పిచికారి చేయాలి. 
-సర్కారు తుమ్మ వంటి పిచ్చిమొక్కలు తొలిగించాలి. 
-లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
-వైకుంఠధామం (శ్మశానవాటిక) నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలి.
-ప్రతి రెండువేల జనాభాకు ఒకటి చొప్పున వైకుంఠధామం నిర్మించాలి.
-ఆరునెలల్లో వైకుంఠధామాలను ఏర్పాటుచేయాలి.
-గ్రామ డంపింగ్‌యార్డు కోసం స్థలం సేకరించాలి.
-విలేజ్ కమ్యూనిటీ హాల్, విలేజ్ గోదాం నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి.
-గ్రామానికి కావాల్సిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు వేర్వేరుగా రూపొందించాలి (ప్లాన్ యువర్ విలేజ్). ఆ గ్రామంలో ఉన్నదేమిటి? కావల్సిందేమిటి? దానికోసం ఏం చేయాలి? అనేది ప్రణాళికల్లో ఉండాలి.

పవర్ వీక్‌లో చేయాల్సిన పనులు

-60 రోజుల కార్యాచరణలో భాగంగా ఏడురోజులు పూర్తిగా విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి.
-గ్రామంలో వీధిలైట్ల కోసం ఎంత కరంట్ వాడుతున్నారో ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. మీటర్లు పెట్టాలి. వీధిలైట్ల కోసం థర్డ్ లైన్‌ను వేయాలి. విధిగా ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలి.
-గ్రామంలో వంగిపోయిన స్తంభాలను సరిచేయాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. కర్ర, ఇనుప స్తంభాలను తొలిగించి, సిమెంటు స్తంభాలను ఏర్పాటుచేయాలి.

తెలంగాణకు హరితహారంలో చేయాల్సిన పనులు

-గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే విలేజ్ నర్సరీ ఏర్పాటుచేయాలి. మండల అటవీశాఖాధికారి నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలి. ఇందుకోసం నరేగా నిధులు వినియోగించాలి.
-గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలి. వాటికి నీళ్లు పోసి, రక్షించాలి. పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగేవరకు బాధ్యత తీసుకోవాలి.
-ఇంటి యజమానులు, రైతులతో మాట్లాడి వారికి ఏ రకం చెట్లు కావాలో ముందే తెలుసుకొని, ఆ మొక్కలను సరఫరాచేయాలి.
-చింతచెట్లను పెద్దసంఖ్యలో పెంచాలి.

గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సిన బాధ్యతలు

-గ్రామంలో వందకు వందశాతం పన్నులు వసూలుచేయాలి. ఇది గ్రామ కార్యదర్శి బాధ్యత.
-వారపు సంత (అంగడి) లో సౌకర్యాలు కల్పించాలి.
-వివాహ రిజిస్ట్రేషన్ నిర్వహించాలి. ఎవరు పెండ్లిచేసుకున్నా వెంటనే రికార్డులో నమోదుచేసుకోవాలి.
-జనన, మరణ రికార్డులు రాయాలి. పుట్టిన వెంటనే కులం వివరాలతో సహా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
-విద్యుత్ సంస్థలకు విధిగా బిల్లులు చెల్లించాలి.
-గ్రామపంచాయతీ నిధులతో నరేగా నిధులు అనుంసంధానం అయ్యే విధానం రూపొందించాలి.
-ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇతర కంపెనీలతో సంప్రదించి, సీఎస్సార్ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించే విధానం అవలంబించాలి.
-గ్రామస్థులను శ్రమదానానికి ప్రోత్సహించి, సామాజిక పనులు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *