పరుగుల సారథులు.. మహిళాశక్తికి వారధులు!

నాలుగు పదుల వయసు వచ్చేవరకూ ఇంటి పట్టున ఉండి ఎన్నో చేశారు. మహిళగా వారి చుట్టూ ఉండే బాధ్యతలు అన్నీ నిర్వహించారు. 40 యేండ్లు గిర్రున తిరిగాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో వెలితి. ఆ సమయంలో వారొక నిర్ణయానికి వచ్చేశారు. గడప దాటి అడుగు బయటకు వేశారు. ఆ అడుగులే పరుగునందుకున్నాయి. ఆరుగురు కలిసి చేసిన మారథాన్. ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అడుగు పెట్టబోయే ఆ ఆరుగురి లక్ష్యం ఒకటే. పరుగు అందుకోవడానికి వయసుతో పని లేదు. పతకాల పంట సాధించేందుకు పోరాడతామంటున్నారు. ఆ పరుగుల రాణుల గురించే ఈ ప్రత్యేకమైన స్టోరీ.. 

బబిత, కృతి, సుమ, రాచెల్ ఛటార్జీ, ఇందు, దివ్యారెడ్డి ఈ ఆరుగురు ఒక బృందం. కలిసి కట్టుగా రాష్ట్ర, జాతీయ అథ్లెటిక్స్‌లో పాల్గొని విజయం సాధిస్తున్న పరుగుల రాణులు. పుట్టింది వేరు వేరు ప్రాంతాలు. కానీ అందరూ పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. కానీ అందరినీ కలిపింది మాత్రం పరుగు. వేర్వేరు వృత్తుల్లో వారికి నలభై యేండ్లు పూర్తయ్యాయి. ఈ నలభై ఏండ్లలో ఒక మహిళగా తన కోసం తాను ఏం చేసుకున్నా అనే ప్రశ్న వాళ్లను వేధించింది. దానికి సమాధానం కూడా వాళ్లే వెతుక్కున్నారు. పరుగు ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి మధ్య పరిచయం ఏర్పడింది. కలిసి వేసిన అడుగులు అన్నీ.. జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లాయి. ఇటీవల గోవాలో జరిగిన మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటి సాధించాలనే స్ఫూర్తికి వయసుకు సంబంధం లేదని నిరూపించారు. 17 రాష్ర్టాల నుంచి 700 మంది మహిళా అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీలో తెలంగాణ నుంచి ఈ ఆరుగురు మహిళలు ప్రతిభ కనబరిచారు. మలేషియాలోని కౌలాలపూర్‌లో జరుగబోయే ఆసియన్ మాస్టర్స్ మీట్‌కు ఈ ఆరుగురు వనితలు సిద్ధమవుతున్నారు. వారి ప్రయాణం ఎలా మొదలైందన్న విషయాలు మనతో పంచుకున్నారు. 

ఆత్మవిశ్వాసంతోనే అంతా..

మొదట మారథాన్‌లలో పాల్గొన్న అనుభవంతో మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొన్నారు. అక్కడే అందరి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నారు. కానీ ముఖ్యంగా వీళ్లకు వయసు, కుటుంబం, వృత్తి, ఉద్యోగ బాధ్యతలు చుట్టు ముట్టాయి. అయినా ఈ సవాళ్లను ఎదిరించారు. కుటుంబం, వృత్తి, శిక్షణ వీటికి ప్రత్యేకమైన సమయం కేటాయించారు. శిక్షణకూ అదనపు సమయాన్ని కేటాయించారు. ఉదయం మూడు గంటలకు మేల్కొని సాధన చేయడం, తర్వాత ఇంటి పనులు పూర్తి చేయడం అటు తర్వాత ఉద్యోగానికి హాజరవడం వీళ్ల దినచర్యలో భాగం. ఈ క్రమంలో గాయాలైనా, ఇబ్బందులు ఎదురైనా వాటిని ఓర్చుకున్నారు.ఇది కేవలం వీళ్ల కోసమే కాదు వీళ్ల లాంటి మహిళల కోసం కూడా అని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయని చాలామంది అనుకుంటారు. కానీ మనోధైర్యం, ఆత్మవిశ్వాం ఉంటే ఏదైనా చేయగలమని అంటున్నారు. నలభై యేండ్ల వయస్సులో ఎలా సాధ్యం అవుతున్నది అని వీళ్లలో ఎవరిని అడిగినా చెప్పేది ఒక్కటే వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని!

womens1

విరమణ తర్వాత..

రాచెల్ ఛటర్జీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. 65 ఏండ్లు. తమిళనాడుకు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్, ఏపీలోని పలు విభాగాల్లో బాధ్యలు నిర్వహించారు. ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేశారు. ప్రస్తుతం ఏపీ రెడ్ క్రాస్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఐఏఎస్ నుంచి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత అనేక మారథాన్‌లలో పాల్గొనేవారు. ఓ రోజు గోవా ఉమెన్స్ మాస్టర్స్ మీట్ గురించి విని శిక్షణ తీసుకొన్నారు. 1500, 800 మీటర్ల పోటీలో పాల్గొని బంగారు పతకాలను సాధించారు. మహిళల్లో చాలా శక్తి ఉంటుంది. దాన్ని ఇంటి వరకే పరిమితం చేయొద్దు. నా ప్రయత్నం నా లాంటి మహిళలకు ఉపయోగ 
పడుతుందని అనుకుంటున్నాను అని రాచెల్ ఛటర్జీ అంటున్నారు.

womens2

ప్రత్యేక శిక్షణతో..

మారథాన్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది దివ్యా. గోవా మీట్ గురించి ఎనిమిది నెలల ముందు విన్నది. అందులో ఎలాగైనా పాల్గొనాలని ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంది. ఓ సంస్థలో డైరెక్టర్‌గా పని చేస్తూ తీరిక లేని సమయం గడిపేది. అయినా ఈ పోటీల కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి, శిక్షణ తీసుకుంది. బంధువులు వద్దన్నా సమస్యలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగింది 1500 మీటర్ల పోటీలో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించింది. 400, 800 మీటర్ల పరుగులో బంగారు పతకాలు అందుకుంది. 

womens3

నూతన ఉత్తేజంతో..

జాక్వెలిన్ బబితా జావియర్ పుట్టింది చెన్నయ్. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. ఫిట్‌నెస్ ట్రెయినర్‌గా పని చేస్తున్నది. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు చిన్న చిన్న పరుగుల కార్యక్రమాల్లో పాల్గొనేది. కొద్ది రోజుల క్రితం మొదటి సారి ఓ మారథాన్‌లో పాల్గొనింది. దానిలో పాల్గొన్న తర్వాత ఆమె అనుభూతి ఆమెకే ఆశ్చర్యమేసింది. మారథాన్ నిర్వాహకుల నుంచి ప్రశంసలు అందాయి. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టే సరికి ఫ్రెండ్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అది తనకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. అలాంటి మారథాన్‌లలో ఇంకా పాల్గొనాలనే ఆసక్తిని పెంచింది. అప్పుడే ఈమెకు రాచెల్ ఛటార్జీ పరిచయం అయ్యారు. ఇద్దరూ కలిసి ఎన్నో మారథాన్‌లలో పాల్గొన్నారు. అదే అనుభవంతో మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ 800 మీటర్ల పోటీలో రజత పతకం సాధించారు. గతంలోనూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. 

womens4

ఫిట్‌నెస్ మారథాన్..

కృతి హైదరాబాద్‌లో వ్యాపార నిర్వాహకురాలు. ఈ మధ్యే తనకు ఫిట్‌నెస్ మారథాన్ పై ఆసక్తి కలిగింది. ఓ కోచ్ దగ్గర చేరి శిక్షణ తీసుకుంది. కేవలం రెండు వారాల్లోనే ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని మాస్టర్స్‌కు సిద్ధమైంది. ఇంట్లో క్షణం తీరిక లేని పరిస్థితుల్లో కూడా ఆమె శిక్షణ తీసుకుంది. మాస్టర్స్‌లో పాల్గొనాలనే లక్ష్యంతోనే ఈమె ముందడుగు వేసి ఈ బృందంలో ఓ సభ్యురాలైంది. ఇది తనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. టీమ్ మధ్య ఉన్న స్ఫూర్తి తనకు మరింత ధైర్యాన్ని పెంచినట్టు చెప్తున్నది. క్రమశిక్షణతో కష్టపడితే ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడిందని అంటున్నది. దీనికి వయసుతో సంబంధం లేదు. అందరు మహిళల్లో అమితమైన శక్తి ఉందని అంటున్నది కృతి. 

womens5

డాక్టర్ నుంచి రన్నర్‌గా..

సుమ వృత్తి రీత్యా ఆర్థో డెంటల్ సర్జన్. సుమారు 28 ఏండ్ల అనుభవం కలిగి ఉన్నారు. పుట్టింది కర్ణాటకలోని హూబ్లీలో. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్‌లో పాల్గొనేవారు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు ప్రత్యేక శిక్షణ ద్వారా ప్రొఫెషనల్ అథ్లెట్ అయ్యారు. రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. తర్వాత రోజుల్లో సాధారణంగానే కుటుంబ, వృత్తి బాధ్యతలు పెరిగాయి.ఈ కారణంగా అథ్లెటిక్స్‌లో ఈమె పాత్ర తగ్గింది. కానీ 42 ఏండ్ల వయస్సులో ఈమెకు శారీరక ఇబ్బందులు వచ్చాయి. మళ్లీ అథ్లెటిక్స్‌లో పాల్గొనడమే దీనికి పరిష్కారం అనుకుంది. వెంటనే శిక్షణ ప్రారంభించింది. కోచ్ నేతృత్వంలో వారంలో ఐదు సార్లు శిక్షణ కొనసాగించింది. అదే అనుభవంతో గోవాలో జరిగిన ఉమెన్స్ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొన్నది. దీంతో మరింత ఆత్మవిశ్వాసం కలిగిందనీ, ఈ టీమ్ తనలో ఇంకా ధైర్యాన్ని పెంచిందని చెప్తున్నది. 

womens6

హిమాలయాల్లో ట్రెక్కింగ్..

హైదరాబాద్‌లో ఇందూహరికూమార్ టీచర్‌గా పని చేస్తున్నది. 50+ వయస్సు. చిన్నప్పటి నుంచి అవుట్ డోర్ స్పోర్ట్స్ అంటే ఇందూకు చాలా ఇష్టం. స్విమ్మింగ్, హైకింగ్, రన్నింగ్ అంటే ఆసక్తి. తరచూ వాటిలో పాల్గొని అనుభవం పొందింది. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శిక్షణ తీసుకుంది. దీంతో పాటు ఇందూ హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన అనుభవాన్ని కలిగి ఉంది. గతంలో హిమాలయా బేస్ క్యాంపులో కూడా పాల్గొన్నది. ఈ అనుభవాలతోనే గోవా మీట్‌కు వెళ్లింది. అక్కడ పాల్గొన్న మహిళలు, వారి స్ఫూర్తి ఆశ్చర్యమనిపించింది. మాకన్నా ఎక్కువ వయసు ఉన్న వారు కూడా ఆ పోటీలో పాల్గొన్నారు. ఇది నాలో మరింత ఆత్మస్థయిర్యాన్ని నింపింది అని అంటున్నది ఇందు. శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అథ్లెటిక్స్ ఎంతో ఉపయోగపడతాయనీ, వయస్సుతో మాత్రం దీనికి సంబంధం లేదని ఆమె చెప్తున్నది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *